పారిశుద్ధ్య సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించండి-కమిషనర్ వికాస్
నెల్లూరు: వర్షాకాలపు వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా నగర వ్యాప్తంగా డ్రైను కాలువల్లో పూడికతీత పనులు, మురుగు పారుదలకు చర్యలు, దోమల వ్యాప్తి నిర్మూలన వంటి వివిధ అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి, పారిశుద్ధ్య సమస్యలను పరిష్కారించాలని నగర పాలక సంస్థ కమిషనర్ వికాస్ మర్మత్ అధికారులకు సూచించారు. పారిశుద్ధ్య నిర్వహణ పనుల పర్యవేక్షణలో భాగంగా కలెక్టర్ బంగ్లా, డీ.కె.మహిళా కళాశాల, కె.వి.ఆర్. కూడలి, ఆర్.టి.సి. బస్టాండు, మద్రాస్ బస్టాండ్, కూరగాయల మార్కెట్టు, బారకాస్, కోటమిట్ట మెయిన్ రోడ్, మూలాపేట తదితర ప్రాంతాలను మంగళవారం అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానికంగా జరుగుతున్న పారిశుద్ధ్య పనులను కమిషనర్ పర్యవేక్షించి అధికారులు, సిబ్బందికి వివిధ సూచనలు జారీ చేశారు.తడి, పొడి చెత్తను వాహనాల ద్వారా ఇళ్ల నుంచి మాత్రమే సేకరించాలని, వీధుల్లో వ్యర్ధాలు వేస్తున్న ప్రాంతాలను గుర్తించి స్థానికులను హెచ్చరించాలని సూచించారు. వీధుల్లో వ్యర్ధాలు వేయకుండా అవగాహన కల్పించి పారిశుద్ధ్య నిర్వహణకు ప్రజలంతా సహకరించేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఆదేశించారు.డ్రైను కాలువల పూడికతీత సిల్టును ఎప్పటికప్పుడు తొలగించి పరిసరాలను శుభ్రంగా ఉంచాలని, దోమల వ్యాప్తి లేకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులను కమిషనర్ ఆదేశించారు.